Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉన్నత చదువులకు.. విద్యా రుణం...

ఉన్నత చదువుల్లో.. విద్యా రుణం తోడు..
ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత కొంతకాలంగా విద్యారుణాలు సులువుగా లభిస్తున్నాయి. బ్యాంకులతోపాటు, బ్యాంకింగేతర రుణ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లూ వీటిని ఇస్తుండటంతో పోటీ పెరిగి, తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి. ఫలితంగా పదవీ విరమణలాంటి అవసరాల కోసం దాచుకున్న పొదుపును ముట్టుకోకుండానే పిల్లల చదువు పూర్తయ్యే అవకాశం కలుగుతోంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా ఒకేసారి అన్ని బ్యాంకులకు దరఖాస్తు చేసే అవకాశం ఉండటం వల్ల చాలామంది దీని సహాయం తీసుకుంటున్నారు. విద్య కోసం అప్పు కావాలి అనుకునే వారికి ఈ పోర్టల్‌ ఒక చక్కని పరిష్కారంలాగా కనిపిస్తోంది. విద్యా రుణాన్ని ఇచ్చే వాటిలో వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వడ్డీ రేట్లు, ఇతర ఆఫర్లు చూసుకోవడానికీ ఇప్పుడు పలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్యాంకులు ఎడ్యుకేషన్‌ లోన్‌ కౌన్సెలర్లను ఇంటికే పంపిస్తున్నాయి. ఉత్తమ విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకులు తక్కువ వడ్డీకి విద్యారుణాలను అందిస్తున్నాయి.
ఎవరికి? ఎందుకు?
ప్రతిభావంతులైన విద్యార్థులకు దేశ, విదేశాలలో ఉన్నత చదువుల నిమిత్తం చెల్లించే ట్యూషన్‌, ఇతర ఫీజులు, సంబంధిత ఖర్చులు, డిపాజిట్లు, బిల్డింగ్‌ ఫండ్‌, హాస్టల్‌, మెస్‌ ఫీజులతోపాటు మోటార్‌ బైక్‌, ల్యాప్‌టాప్‌ వంటి ఖర్చుల కోసమూ అప్పు ఇస్తారు. రుణానికి అనుబంధంగా తీసుకున్న బీమా పాలసీకి చెల్లించాల్సిన ప్రీమియానికీ అప్పు లభిస్తుంది. విద్యార్థి తన తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు భారత్‌లో ఉన్న తన దగ్గరి బంధువుతో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయాలి.
ఏ కోర్సులకు.. ఎంత వరకూ..
ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, మెడికల్‌, నర్సింగ్‌, పైలట్‌, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులలో డిగ్రీ/పీజీలకు వర్తిస్తుంది. కొన్ని సంస్థలు వృత్తి సంబంధిత ఐటీ/పాలిటెక్నిక్‌, దూర విద్య ద్వారా లభించే కోర్సులకూ కొన్ని సంస్థలు తక్కువ అప్పు ఇస్తున్నాయి.
* ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం సాధారణంగా విదేశాలలో చదువు కోసం రూ.20లక్షలు, మన దేశంలో విద్య కోసం రూ.10లక్షల వరకూ అన్ని బ్యాంకులూ అప్పు ఇస్తాయి. పెద్ద బ్యాంకులలో ఇంకా ఎక్కువ లభించే పథకాలూ ఉన్నాయి. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో తెలిపిన ప్రకారం దేశీయంగా చదువు కోసం రూ.40లక్షలు, విదేశాలలో విద్యకు రూ.1.50 కోట్ల వరకూ రుణం అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాలో రూ.25లక్షలపైనా రుణం అందుబాటులో ఉంది. రూ.4లక్షల వరకూ మార్జిన్‌ అవసరం లేదు. ఆ పైన 5-15శాతం వరకూ మార్జిన్‌ చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డీ మాటేమిటి?
వడ్డీశాతం అప్పు మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. వార్షిక వడ్డీ 8.20% - 16.00% మధ్య ఉంటోంది. కొన్ని పథకాల్లో క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉంటే. వడ్డీ రాయితీ ఇస్తారు. బాలికలకు 0.50శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. మారటోరియం సమయంలో వడ్డీ చెల్లించడం ద్వారా వడ్డీలో 0.50 శాతం రాయితీ లభిస్తుంది. చెల్లించిన వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80ఈ ప్రకారం ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఎప్పుడు  చెల్లించాలి..

కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత నుంచి లేదా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఏది ముందు అయితే అప్పటి నుంచి 15 ఏళ్లలోపు నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. రూ.20లక్షల పైన అప్పులకు మారటోరియం కాలంలో తప్పక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రూ.20లక్షల లోపు అప్పు తీసుకున్న వారు వడ్డీ చెల్లించాలా లేదా అనేది ఐచ్ఛికం. చదివిన కోర్సు పూర్తయి, ఇంకో పై కోర్సు చదవాలని అనుకుంటే చాలాసార్లు మారటోరియం పొడిగిస్తారు.
హామీ అవసరమా?
సాధారణంగా అన్ని రకాల అప్పులకు ఏదో ఒక హామీ తప్పనిసరి. కానీ, విద్యా రుణాల విషయంలో రూ.7.50లక్షల వరకూ ఎటువంటి హామీ (సెక్యూరిటీ) అవసరం లేదు. రూ.7.50లక్షల పైన వాటికి మాత్రం హామీ అవసరం. కానీ, ఎస్‌బీఐలాంటి కొన్ని బ్యాంకులు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చదువుకునే వారికి నిబంధనలకు లోబడి ఎటువంటి తనఖా లేకుండా రూ.40లక్షల వరకూ ఇస్తున్నాయి.
సున్నా శాతం వడ్డీ...
ఏప్రిల్‌ 1, 2018 నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం ప్రకారం రూ.4.50లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు, వారి అప్పు రూ.7.50లక్షల లోపు ఉంటే.. మారటోరియం కాలంలో మొత్తం వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. దీని కోసం ప్రతి ఏడాది కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్‌ బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. చదువు మధ్యలో ఆపేసిన, లేదా డిబారైన వారికి ఇది వర్తించదు.
విదేశీ చదువుల కోసం..
విదేశీ విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేకాక రూపాయి విలువ బలహీనపడటం వల్ల మారకం రేటు పెరిగి, విదేశీ చదువుల ఖర్చులు బాగా పెరిగాయి. చాలా బ్యాంకులు వారి నిబంధనలకు లోబడి తక్కువ మార్జిన్‌తో మొత్తం విద్యా ఖర్చులతోపాటు, ప్రయాణ ఖర్చులు కలిపి అప్పుగా ఇస్తున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐలాంటి పెద్ద బ్యాంకుల్లో విదేశీ చదువుల కోసం రూ.1.50 కోట్ల పైనా అప్పు ఇచ్చే అవకాశం ఉంది. చైనా, రష్యా, ఉక్రెయిన్‌ వంటి దేశాల్లో చదువుకునే వారికి బ్యాంకులు అప్పు ఇవ్వకపోవచ్చు.

వృత్తి విద్యకూ...
గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా చదువుకునే ఐటీఐ/పాలిటెక్నిక్‌లాంటి వృత్తి విద్యా కోర్సులకూ రుణం వస్తుంది. చాలాబ్యాంకులు వీరిని ఎలాంటి సెక్యూరిటీ
అడగకుండా రూ.1.50లక్షల వరకూ అప్పు ఇస్తున్నాయి. చదువు పూర్తయిన ఏడేళ్లలోగా అప్పు తీర్చేయాల్సి ఉంటుంది.
చాలా బ్యాంకులు విద్యారుణాన్ని త్వరగా మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనలను తగ్గించుకున్నాయి.
ఈ మధ్యకాలంలో అన్ని పెద్ద బ్యాంకులూ ప్రాసెస్‌ వ్యవధిని తగ్గించుకునేందుకు వీలుగా ఆస్తుల పట్టిక, అభిప్రాయ నివేదికలాంటి వాటిని తొలగించాయి. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా విద్యారుణం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

No comments:

Post a Comment